విధాన పరిచయము

విపశ్యన భారత దేశపు అతిపురాతనమైన ధ్యాన పధ్ధతి. 2,600 సంవత్సరాల క్రితం కనుమరుగైన ఈ ధ్యానపద్ధతిని గౌతమబుద్ధుడు తన స్వయం కృషితో వెతికి వెలికి తీసాడు. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం.ఇది ఒక స్వయం పరిశీలనాప్రక్రియ. సాధకుల మనస్సు యొక్క ఎకాగ్రతకోసం సహజ స్వాభావిక శ్వాసను చూడటంతో ప్రారంభించి, జాగృత మనస్సుతో శరీరము మనస్సుల పరివర్తనా స్వభావాన్ని పరిశీలిస్తూ అనిత్యము, దు:ఖము, అనాత్మ అనే విశ్వజనీన సత్యాల అనుభూతిని పొందగలుగుతారు. ప్రత్యక్షానుభూతితో సత్యాన్ని దర్శించటం ద్వారా మనస్సును నిర్మలం చేసుకొనడం ఈ సాధనావిధి ప్రత్యేకత. ధర్మమార్గము ఆద్యంతము మానవాళి ఎదుర్కొనే సార్వజనీన వ్యాధులకు సార్వజనీన ఔషధం. దీనికి ఏ మతమ్తోగాని వర్గంతోగాని నిమిత్తంలేదు. జాతి, కుల, మాట భేదాలు లేకుండా ఎవరైనా సాధనచేసి సమంగా ప్రయోజనం పొందవచ్చు.

ఏది విపశ్యన కాదు:

 • ఇది అంధ విశ్వాసం పై ఆధార పడిన కర్మ కాండ కాదు.
 • ఇది ఒక మేధో లేదా ఒక తాత్విక వినోదం కాదు.
 • ఇది చికిత్స నెలవు కాదు, సెలవు దినం కాదు , సామాజిక బంధాలను పెంచు కోవడానికి అవకాసం కాదు.
 • ఇది దైనందిత జీవిత కష్టాల నుండి తప్పించుకొనే అవకాసము కాదు.

విపశ్యన అంటే:

 • ఇది భాధలను రూపు మాపే ఒక పద్ధతి.
 • ఇది జీవితం యొక్క ఉద్రిక్తతలు మరియు సమస్యలను ప్రశాంతంగా, సమతుల్యంగా ఎదుర్కుంటూ, మనస్సు శుద్ధి చేసే ఒక పద్ధతి.
 • ఇది ఒక జీవన కళ. దానిని సమాజానికి మంచి చేయడానికి ఉపయోగించవచ్చు.

నిర్వాణము, ముక్తి వంటి అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యసాధనకోసమే విపశ్యన ధ్యానము ఉద్దేశించబడింది. కేవలం శారీరిక వ్యాధులను నయం చేయటం దీని లక్ష్యం కాదు. అయితే మనస్సు నిర్మలం కావటం వల్ల ఇతర ఫలితాలతో పాటు శారీరిక మానసిక బాధలు కూడా ఉపశమిస్తాయి. ఈ విద్య సమస్త దు:ఖాలకు కారణాలైన రాగ, ద్వేష, మోహాలను నిర్మూలం చేసే జీవనకళ. నిత్య జీవితంలో అనుభవించే అశాంతిని దూరంచేసి ఇష్టమైన లేదా అయిష్టమైన పరిస్థితుల పట్ల సంయమనం లేకుండా ప్రతిస్పందించే మన పాత అలవాటు ఫలితంగా ఏర్పడే బంధనాలను తొలగిస్తుంది. వ్యక్తి, సమాజాల ప్రగతికోసం సృజనాత్మకశక్తిని పెంపొందిస్తుంది.

విపశ్యన, బుధుడు అభివృధి చేసిన ఒక పద్ధతి అయినప్పటికీ దీని ఆచరణ బౌద్ధులకు మాత్రమే పరిమితం కాలేదు. మార్పిడి అనే ప్రశ్నే లేదు. మానవులందరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కుంటారు వాటిని నిర్మూలించే పద్ధతి కూడా సార్వజనీకం అనే సూత్రం మీద ఆధార పడిఉంది. అనేక మతాల యొక్క ప్రజలు విపశ్యన ధ్యానం యొక్క ప్రయోజనాలు అనుభవించారు మరియు ఇది వారి విశ్వాసాలకు విరుద్ధం కాదు అని కనుగొన్నారు.

ధ్యానము మరియు స్వీయ క్రమశిక్షణ

ఆత్మ శోధన ద్వార స్వీయ శుద్దీకరణ యొక్క ప్రక్రియ ఖచ్చితంగా ఎప్పటికి సులభతరం కాదు - సాధకులు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. వారి సొంత ప్రయత్నాలతో, సాధకులు వారి సొంత అనుభవాలను చేరుకుంటారు. మరెవరు వారి కోసం ఇది చేయలేరు. కావున ఈ ధ్యానం, ఎవరైతే తీవ్రంగా పని చేయగలరో మరియు క్రమశిక్షణ పాటించగలరో వారికి మాత్రమే సరి పోతుంది. ఈ క్రమశిక్షణ సాధకుల ప్రయోజనం మరియు రక్షణ కోసం మాత్రమే మరియు ఇది ధ్యాన సాధనలో సమగ్ర భాగం.

అపస్మారక మనస్సు యొక్క లోతైన స్థాయిలకు చొచ్చుకుని వెళ్లి అక్కడ ఉన్నవికారాలను ఎలా రుపుమాపాలో నేర్చుకోవడానికి పది రోజులు ఖచ్చితంగా తక్కువ సమయమే. ఏకాంతంలో నిరంతర సాధనే ఈ పద్దతిలో విజయానికి రహస్యం. ఆచరణాత్మక అంశాలను దృష్టిలో పెట్టుకొని నియమాలను మరియు నిభందనలను రూపొందించారు. అవి ముఖ్యంగా ఆచార్యుల లేదా శిబిర నిర్వాహుకుల ప్రయోజనం కోసం కాదు. అవి ఏ వ్యవస్థీకృత మతం యొక్క ప్రతికూల భావాలు, ఛాందసత్వం లేదా అంధ నమ్మకం కాదు. అవి వేల మంది సాధకుల, అనేక సంవత్సరాల సాధన అనుభవం ఆధారంగా రూపొందించినవి మరియు శాస్రియము, హేతుబద్ధము. నియములకు కట్టుబడి ఉండటం ధ్యానంకు మంచి అనుకూలమైన పరిస్థితులను రూపొందిస్తాయి. నియమాలను భగ్నం చేయడం వాతావరణం కలుషితం అవుతుంది.

సాధకులు శిబిరంలో పూర్తిగా పదిరోజులు ఉండాలి. అంతేకాదు, నియమాలను చదివి బాగా అర్థంచేసుకోవాలి. నియమావళిని నిజాయతితో పాటించగలము అన్న నమ్మకము ఉన్నవారే ప్రవేశం కోసం అభ్యర్థించాలి. మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయటానికి సిద్ధంగా లేనివారు తమ కాలాన్ని వృధా చేసుకోవడమేగాక గంభీరంగా పనిచేయదలచుకున్నవారికి అంతరాయం కలిగించినవారవుతారు. నియమావళి కఠినంగా ఉందని, దానిని పాటించటం సాధ్యం కాదని శిబిరం చివరి వరకు పూర్తిచేయకుండా మధ్యలో వదిలిపెట్టి పోవటం హానికరమని శిబిరంలో చేరబోయే వారిని ముందుగానే హెచ్చరించడమైనది.

తీవ్రమైన మానసిక రుగ్మతలను కలిగిన వ్యక్తులు

తీవ్రమైన మానసిక రుగ్మతలు ఉన్న కొందరు అప్పుడప్పుడు విపశ్యన శిబిరాలకు అవాస్తమైన అంచనాలతో వస్తుంటారు. ఈ పద్ధతి ద్వార మానసిక రుగ్మతలు నివారణ చేయవచ్చు లేదా ఉపసమనం పొందవచ్చు అని ఆశిస్తారు. వ్యక్తుల మద్య అస్థిర సంభంధాలు, వివిధ చికిత్సల చరిత్ర కలిగి ఉండటం , అటువంటి వ్యక్తులు ప్రయోజనం పొందాటక పోవటానికి అదనపు కారణాలు కావచ్చు. వారు ఒక 10 రోజుల శిబిరం కూడా చేయలేక పోవచ్చు. ఒక స్వచ్చంద సంస్థ సామర్థ్యంలో మాకు ఇటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తుల సరైన సంరక్షణ అసాధ్యం అవుతుంది. విపశ్యన ధ్యానం చాల మందికి ప్రయోజనకారి అయినప్పటికీ, ఇది వైద్య లేదా మానసిక చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మేము అటువంటి తీవ్ర మానసిక రుగ్మతలు ఉన్న వారికి సిఫార్సు చేయము.

క్రమశిక్షణ నియమావళి

సాధనకు పునాది శీలం — నైతిక ప్రవర్తన. శీలం సమాధి — మానసిక ఏకాగ్రత పెంపోదించు కోవటానికి ఆధారం అవుతుంది ; మరియు మనస్సు యొక్క శుద్దీకరణ ప్రజ్ఞ — అంతః జ్ఞానం వల్ల సాధ్యమవుతుంది.

నియమాలు

శిబిర కాలంలో అందరూ ఈ క్రింది నైతిక నియమాలను ఖచ్చితంగా పాటించాలి:

 1. జీవహింస చేయరాదు;
 2. దొంగతనం చేయరాదు;
 3. బ్రహ్మచర్యాన్ని పాటించాలి;
 4. అబద్ధం పలుకరాదు;
 5. ఏ విధమైన మత్తు పదార్థాలను సేవించరాదు;

ఇదివరకే శిబిరాలు చేసిన పాత సాధకులు అదనంగా ఈ క్రింది మూడు నియమాలను పాటించాలి:

 1. మధ్యాహ్నం 12 గంటల తరువాత భోజనం చేయరాదు;
 2. మనోల్లాస సుఖాలకు దూరంగా వుండాలి;
 3. ఎత్తుగా, విలాసవంతంగా ఉన్న పడకపై పడుకోరాదు;

పాత సాధకులు సాయంత్రం 5 గంటలకు ఇచ్చే విరామంలో నిమ్మరసం మాత్రమే తీసుకుని పైన పేర్కొన్న ఆరవ నియమాన్ని పాటించాలి. కొత్త సాధకులకు టీ, తేలికైన ఉపాహారం, పళ్ళు ఇస్తారు.అనారోగ్యంతో బాధపడే వారు ఆచార్యుని అనుమతితో వీటి నుండి మినహాయింపు పొందవచ్చు. ఏదో, ఎన్మిదవ నియమం అందరు పాటించాలి.

ఆచార్యుని పట్ల, ధ్యాన పధ్ధతి పట్ల సమర్పితభావం:

సాధకులు శిబిరం పూర్తి సమయం, ఆచార్యుల మార్గదర్సనానికి, సూచనలకు పూర్తిగా లోబడి ఉంటానని తెలియచేయాలి. అంటే శిబిరం పూర్తి సమయం క్రమశిక్షణను పాటిస్తానని, ఆచార్యులు చెప్పిన విధంగానే, ఏ సూచనలను విస్మరించకుండా, ఇంకా ఏవి కలపకుండా ధ్యానం చేస్తానని ఆత్మ సమర్పణ చేయాలి. ఈ సమర్పణ, పూర్తి విచక్షణ, అవగాహనతో కూడినది అయి ఉండాలి.గుడ్డిది కాకూడదు. ఇటువంటి సమర్పిత భావం ఉన్నప్పుడే శ్రద్ధగా, పట్టుదలతో పనిచేయటం సాధ్యమవుతుంది. ఆచర్యులలో, పద్దతిలో అటువంటి నమ్మకం ధ్యానం లో విజయం సాదించడానికి అవసరం.

పూజాపునస్కారాలు, ఇతర ధ్యానపద్ధతులు

శిబిరకాలంలో అగరవత్తులు వెలిగించటం, దీపాలు వెలిగించటం, జపమాల తిప్పటం, మంత్రాలు చదవటం, ఉపవాసాలు చేయటం, ప్రార్థన చేయటం మొదలైన వాటిని పూర్తిగా వదిలివేయాలి. ఇతర ధ్యానపద్ధతులను విమర్శించనవసరంలేదు, కాని వాటిని శిబిరంలో ఉన్నంతకాలం తాత్కాలికంగా రద్దుచేయాలి. విపశ్యన ధ్యాన పద్ధతిని, దాని స్వచ్చ స్వరూపాన్ని తెలుసుకోవటానికి సాధకుడి మేలు కోసం ఈ నియమాన్ని రూపొందించడమైనది.

ఈ విషయంలో ఆచార్యుడు పదే పదే హెచ్చరించినా కూడా సాధకులు ఉద్దేశపూర్వకంగా విపశ్యనతో ఇతర ధ్యానపద్ధతులను లేదా పూజాపునస్కారాలను కలిపి సాధన చేయటంవల్ల తమకు తాము తీవ్రమైన హాని కలిగించుకున్నవారవుతారు. శిబిరంలో పాల్గొనే సాధకులు ఆచార్యులు చెప్పినది చెప్పినట్లుగా అదనంగా ఏమీ జోడించకుండా పనిచేయాలి. ఏవైనా సందేహాలు లేదా అర్థంకాని విషయాలు వుంటే ఆచార్యున్ని కలిసి సమాధానం పొందవచ్చు.

ఆచార్యుడిని కలవటం:

ధ్యానానికి సంబంధించిన సమస్యలు, సందేహాలు ఏమైనా ఉంటె ఆచార్యునితో సంప్రదించి పరిష్కరించుకోవచ్చు. మధ్యాహ్నం 12-1 గం||ల మధ్య సాధకులు ఆచార్యుని కలవవచ్చు. రాత్రి 9-9:30 గంటల మధ్య ప్రశ్నలు అడగవచ్చు. ధ్యానపద్ధాతికి సంబంధించిన ప్రశ్నలకోసమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తాత్విక తర్కవితర్కాలతో సమయం వృధా చేయరాదు.

ఆర్య మౌనం:

శిబిరం మొదటి రోజునుండి పదో రోజు ఉదయం 10 గంటల వరకు ఆర్య మౌనాన్ని సాధకులందరూ తప్పక పాటించాలి. ఆర్య మౌనం అంటే శరీరం, మాటలు, మనస్సులతో మౌనం. సైగలు, సంకేతాలు, మరేవిధంగానైనా ఇతరులతో సంప్రదించరాదు

కాని అవసరమైతే ఆచార్యునితో మాట్లాడవచ్చు. వసతి, భోజనం తదితర సమస్యల గురించి నిర్వాహకులను కలవవచ్చు. కాని సాధ్యమైనంతవరకు అత్యవసరమయితేనే ఈ పని చేయాలి.

మహిళలు - పురుషుల విభజన:

శిబిరంలో స్త్రీలు, పురుషులు, దంపతులు కూడా ఒకరితో ఒకరు ఏ విధమైన సంపర్కం పెట్టుకోకూడదు. శిబిరకాలంలో ఒకరితో ఒకరు మాట్లాడడానికి, కలవడానికి వీలుండదు. ఈ నియమం స్నేహితులకు, పరివార జనాలకు కూడా వర్తిస్తాయి.

భౌతిక సంప్రదింపు

శిబిరం అంతటా ఒకే లేదా వ్యతిరేక లింగ వ్యక్తుల మధ్య ఎలాంటి భౌతిక సంప్రదింపులు ఉండకుండా ఉండటం ముఖ్యం

యోగాసనాలు, వ్యాయామం:

విపశ్యన ధ్యానంతోపాటు యోగాసనాలు, వ్యాయామం చేయవచ్చు. కాని వాటికోసం కేంద్రంలో ప్రత్యేక సౌకర్యం లేదు కాబట్టి వాటిని తాత్కాలికంగా మానుకోవాలి. కేంద్రంలో ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశంలో సాధకులునడవ వచ్చు.

తాయత్తులు, జపమాలలు వంటి మత సంభందమైన వస్తువులు :

తాయత్తులు, జపమాలలు వంటి వస్తువులను శిబిరానికి తీసుకురాకూడదు. ఒకవేళ తెలియక తీసుకుని వస్తే యాజమాన్యం వద్ద శిబిరం పూర్తి అయ్యే వరకు వాటిని భద్రపరచాలి.

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు:

గంజాయి, హాషిష్, మారిజన వంటి మాదక పదార్థాలు దగ్గర ఉంచుకోవటం ఈ దేశ చట్టాలకు విరుద్దం. వాటిని శివిరంలోనికి తీసుకురావటం నిషిద్ధము. డాక్టర్ సలహామేరకు తీసుకునే ఔషధాల గురించి ముందుగానే ఆచార్యునికి తెలియజేయాలి.

పొగాకు

పొగత్రాగటం కాని, పొగాకు నమలటం కాని శిబిరంలో అనుమతించబడదు

భోజన వసతి

శిబిరా నిర్వాహకులు సాధనకు అనుకూలమైన, సమతుల్యమైన, పరిపూర్ణమైన ఆహరం అందించడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. ఏ సాధకులైన, అనారోగ్య కారణాల వల్ల, ఏదైనా ప్రత్యేక ఆహరం తీసుకోవాలని సూచించి ఉంటె, వారు శిబిర నిర్వాహకులకు దరఖాస్తు చేసుకునేటప్పుడే తెలియ చేయాలి. ఉపవాసంకు అనుమతి లేదు.

దుస్తులు

శిబిరంలోని గంభీర వాతావరణానికి అనుగుణంగా బట్టలు కట్టుకునే విధానం సభ్యతతో కూడుకుని వుండాలి. వీపు, ఛాతీ, కాళ్ళు - (ఎండాకాలం అయినా) వీటిని కప్పివుంచాలి. శరీర అవయవాలను ప్రదర్శించే విధంగా దుస్తులు వేసుకోరాదు. సన్ - బేతింగ్ నిషిద్ధము. ఇతర సాధకుల ధ్యాన భంగం కలిగించకుండా ఉండటం కోసము ఈ నియమాలను పాటించటం ఆవశ్యకము

చాకిలి పని మరియు స్నానం

వాషింగ్ మిషన్లు, డ్రయర్లు అందుబాటలో ఉండవు, కాబట్టి విద్యార్థులు సరైన దుస్తులు తీసుకుని రావాలి. చిన్న దుస్తులు చేతితో ఉత్తుకోవచ్చు. స్నానం మరియు దుస్తులు ఉత్తుకోవడం ధ్యాన సమయంలో కాకుండా, విరామ సమయంలో చేసుకోవచ్చు.

బయటి వారితో సంపర్కం:

శిబిరం చివరి వరకు సాధకులు కేంద్రంలో వుండాలి. ఇతరులతో టెలిఫోను ద్వారాకాని, ఉత్తరాల ద్వారాకాని సంబంధం పెట్టుకోరాదు. సెల్ ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, శిబిరం ముగిసేవరకు, నిర్వాహకుల వద్ద భద్ర పరచాలి. అత్యవసర పరిస్థితులలో స్నేహితులు లేదా బంధువులు నిర్వాహకులను సంప్రదించవచ్చు.

సంగీతం, చదవటం, రాయటం:

సంగీత వాద్యాలను వాయించటం, రేడియోలను పెట్టటం మొదలైనవి నిషేధించబడినవి. చదువుకోవటానికి పుస్తకాలుగాని, పత్రికలూ గాని (అవి విపశ్యన గురించి పుస్తకాలు అయినా సరే) రాసుకోవడానికి పుస్తకాలు కాని, శిబిరానికి తీసుకురాకూడదు. ధ్యానం యొక్క ఆచరాత్మక విశిష్టతను నొక్కిచేప్పటానికే చదవటంపై, రాయటంపై ఈ విధమైన ఆంక్షలు విధించటం జరిగింది.

టేప్ రికార్డర్లు, కెమెరాలు:

ఆచార్యుని ప్రత్యేక అనుమతి ఉన్నప్పుడు తప్ప వీటిని ఉపయోగించడం నిషేధించబడినది.

శిబిరం పెట్టుబడులు

స్వచ్చ విపశ్యన సంప్రదాయం ప్రకారం, శిబిరాలు అన్ని దానాల మేడే ఆధారపడి నడపబడుతాయి. దానాలు కూడా ఎవరైతే శ్రీ గోయెంక గారు లేదా అతని సహాయక ఆచార్యుల వద్ద 10 రోజుల శిబిరం చేసిన వారి నుండే స్వీకరించపడుతాయి. మొదటిసారి శిబిరం చేసిన వారు శిబిరం పూర్తి చేసిన తరువాత కాని, తరువాత ఎప్పుడైనా దానం ఇవ్వవచ్చు.

ఈ విధంగా శిబిరాలు, ఎవరైతే సాధన యొక్క ప్రయోజనాలు గ్రహించారో వారి మద్దతుతో నడప బడుతున్నాయి. ఈ ప్రయోజనాలను ఇతరులతో పంచుకోవాలని ఆశిస్తు, సాధకులు వారికి తోచినంత, మంచి సంకల్పంతో ఇస్తారు. ఇలాంటి విరాళాలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఈ సంప్రదాయంలో నడపబడుతున్న శిబిరాల నిధుల మూలం. ఏ సంపన్న సంస్థ కాని, వ్యక్తి కాని పోషకులు కాదు. ఆచార్యులు కాని, నిర్వాహకులు కాని వారి సేవ కోసం ఎటువంటి పారితోషకం అందుకోరు. ఈ విధంగా విపశ్యన వ్యాప్తిని, వ్యపరాపేక్ష లేకుండా స్వచత కోసమే చేయబడుతున్నాయి.

విరాళం చిన్నదైన, పెద్దదైన, ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దశ్యంతో ఇవ్వాలి : ' నేను పాల్గొన్న శిబిరం, పాత సాధకుల దాతృత్వం వల్ల నడపబడినది; భవిష్యత్తు శిబిరాల కోసం ఇప్పుడు నేను దానం చేస్తాను. దాని వల్ల మరి కొంత మంది ప్రయోజనం పొందుదురు గాక'

సారాంశం

క్రమశిక్షణ మరియు నియమాలు వెనుక అంతరార్థాన్ని ఈ క్రింది విధంగా సంగ్రహించబడినది:.

మీ చర్యలు ఎవరిని అయిన ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు చాల జాగ్రతగా ఉండండి. ఇతరులు కలిగించే చిరాకులను పట్టించుకోవద్దు.

పైన వివరించిన నియమాల వెనుక వున్నా కారణాలు సాధకులకు అర్థం కాకపోవచ్చు. అనుమానంతోనూ, ప్రతికూల భావంతోనూ, అయిష్టంగా సాధన చేయటం కంటే వెంటనే ఆచార్యున్ని లేదా నిర్వాహకులను కలిసి సమాధానం పొందటం బాగుంటుంది.

క్రమశిక్షణతో సాధకులు పూర్తి కృషి చేసినప్పుడే, ఈ పద్ధతి యొక్క ప్రయోజనం పొందుతారు. శిబిరంలో పాముఖ్యత అంతా కృషి మీదే. ఒక బంగారు నియమం ఏమిటంటే, మీరు ఒంటరిగా ఉన్నారనుకొని, మీ మనస్సులోకి తిరిగి చూడండి. అన్ని అసౌకర్యలను, ఏవైనా ఇబ్బందులను ఎద్దుర్కుంటే వాటిని విస్మరించండి.

విపశ్యనలో సాధించే ప్రగతి సాధకుల పారమితల (పూర్వం ఆర్జించిన పుణ్యఫలాల) మీద, మరియు వారి హృదయపూర్వక కృషి, శ్రద్ధ, చిత్తశుద్ధి, ఆరోగ్యం, ప్రజ్ఞ అనే అయిదు విషయాల మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి.

పైన వివరించిన నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళి, కాలపట్టిక ఈ ధ్యాన శిక్షణా శిబిరంలో మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉండుగాక.

శిబిర కాల పట్టిక

సాధన నిరంతరతను నెలకొలిపే ఉద్దేశ్యంతో ఈ క్రింది కాలపట్టిక రూపొందించబడింది. మంచి ఫలితాల కోసం సాధకులు ఈ కాలపట్టికను తప్పక అనుసరించాలి.

ఉదయం 4 గం||   ఉదయం లేవటానికి గంట
4:30-6:30 గం||   ధ్యాన కేంద్రంలో లేదా శూన్యగారంలో ధాన్యం
6:30-8:00 గం||   అల్పాహార విరామం
8:00-9:00 గం||   హాల్లో సాముహిక ధ్యానం
9:00-11:00 గం||   ఆచార్యుల సూచనా ప్రకారం హాల్ లో లేదా శూన్యగారంలో ధ్యానం
11:00-12:00 మద్యాహ్నం   భోజనం విరామం
12noon-1:00 గం||   విశ్రాంతి మరియు ఆచార్యులతో ప్రశ్నోత్తరాల సమయం
1:00-2:30 గం||   హాల్ లో లేదా శూన్యగారంలో ధ్యానం
2:30-3:30 గం||   హాల్లో సాముహిక ధ్యానం
3:30-5:00 గం||   ఆచార్యుల సూచనా ప్రకారం హాల్ లో లేదా శూన్యగారంలో ధ్యానం
5:00-6:00 గం||   టీ విరామం
6:00-7:00 గం||   హాల్లో సాముహిక ధ్యానం
7:00-8:15 గం||   హాల్ లో ఆచార్యుల ప్రవచనం
8:15-9:00 గం||   హాల్లో సాముహిక ధ్యానం
9:00-9:30 గం||   హాల్ లో ప్రశ్నోత్తరాల సమయం
9:30 గం||   మీ గదుల్లో విరామం - లైట్స్ ఆఫ్

శిబిరానికి దరఖాస్తు చేసుకునే ముందు జాగ్రత్తగా చదివి మరియు సమీక్షించటం కోసం పైన పేర్కొన్న క్రమశిక్షణ నియమావళి ప్రతిని అడోబీ అక్రోబాట్ రూపంలో a href="http://www.dhamma.org/en/docs/core/code-en.pdf" target="_">ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించి నియమిత విపశ్యన ధ్యాన శిబిరంలో ప్రవేశమునకు అభ్యర్థించవచ్చు