జీవనకళ : విపశ్యన ధ్యానము

ఈ క్రింద ఉన్న పాఠం, శ్రీ గోయెంక గారు బెర్న్, స్విట్జర్లాండ్ ఇచ్చిన, ప్రసంగం మీద ఆధారపడి ఉంది .

ప్రతి ఒక్కరూ శాంతిని, సామరస్యాన్ని కోరుకుంటారు, ఎందుకంటే మన జీవితంలో మనకు ఇవే లేవు కనుక. ఎప్పటికప్పుడు మన జీవితాలలో మనము ఆందోళన, చికాకు మరియు సామరస్యం లేకపోవడం లాంటివి అనుభవిస్తూ ఉంటాము. అలా వీటితో బాధపడుతూ ఉన్నప్పుడు, మనం వాటిని మనవరకే సీమితం చేసుకోము, ఇతరులకు కుడా వాటిని పంచుతూ ఉంటాము. ఆ బాధ అనేది మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి కూడా విస్తరిస్తుంది, మరియు బాధలో ఉన్న వ్యక్తి యొక్క సంపర్కంలోకి వచ్చిన వారందరు కూడా ప్రభావితులు అవుతారు. ఖచ్చితంగా ఇది నేర్పరితనంతో గడిపే జీవనమైతే కాదు.

మనం, మనతో శాంతిగా నివసించాలి మరియు ఇతరులతో కూడా శాంతియుతంగా ఉండాలి. మానవులు సంఘ జీవులు, సమాజంలో ఒకరికోకరితో వ్యవహరించాల్సి ఉంటుంది. కాని మనం శాంతియుతంగా ఎలా జీవించాలి? మనం మనలో ఎలా సామరస్యంగా ఉండాలి మరియు ఇతరులతో శాంతి, సామరస్యం ఎలా కొనసాగించాలి, దాని వాళ్ళ ఇతరులు కూడా శాంతి, సామరస్యంతో జీవించగలరు?

మన కష్టాల నుండి ఉపసమనం పొందటానికి, మనం దానికి మూల కారణం తెలుసుకోవాలి - దుఃఖానికి కారణం. మనం సమస్యను దర్యాప్తు చేస్తే, మన మనసులో ప్రతికూల భావన లేదా కల్మషం జనించిన ప్రతిసారి మనం భాధకు గురవుతామని స్పష్టం అవుతుంది. మనసులో వికారాలు, మానసిక అపవిత్రత లేదా కల్మషం; శాంతి, సామరస్యంతో కలిసి ఉండలేవు.

మన మనస్సులో వికారాలు, వ్యతిరేకభావాలు ఎలా తలెత్తుతాయి? బాగా పరిశీలించి చూస్తే, ఎవరైనా మనకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే బాధపడటం.మనకు అయిష్టమైన విషయాలు ఏవైనా జరుగుతుంటే మనలో మనం అశాంతిని సృష్టించుకుంటూ ఉంటాం. మనం కోరుకున్నవి జరగకపోవచ్చు.అడ్డంకులు ఎదురవుతుంటాయి. అప్పుడు మళ్ళీ అశాంతిని కలుగాజేసుకుంటూ, మనలోపల బంధనాలు, ముడులూ వేసుకుంటూపోతాం . జీవితాంతం ఇలా అయిష్టమైనవి ఏవో జరుగుతూనే ఉంటాయి. ఆశించినవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ విధంగా ముడులను వేసుకునే అలవాటు మన మొత్తం శారీరిక, మానసిక జగత్తును అశాంతి, అలజడి, కలత, వ్యతిరేక భావాలతో నింపివేస్తుంది. దీనితో జీవితం దుః:ఖమయమవుతుంది.

మనం కోరుకున్న విధంగానే జరిగేటట్లూ, మనకు అయిష్టమైనవి ఏవి జరగకుండా వుండేటట్లూ మన జీవితాన్ని మలచుకోవటమే ఏ సమస్యకు ఒక పరిష్కారం. మనకు అయిష్టమైనవి జరగకుండా, ఇష్టమైనవే జరిగే విధంగా చూసుకోవటానికి అవసరమైన శక్తిని మనలో మనమే వృద్ధి చేసుకోవాలి, లేదా ఈ శక్తి ఎవరి వద్దన్నా ఉంటె మనకు అవసరమైనప్పుడు అభ్యర్తిన్చాగానే వారు సహాయపడే విధంగా చూసుకోవాలి. కానీ ఇదంతా జరిగే పని కాదు గదా! కోరుకున్నవి కోరుకున్నట్లే జరగటం, కోరిన కోరికలన్నీ తీరటం, అయిష్టమైనది ఏమీ జరగకుండా ఉండటం ప్రపంచంలో ఎవరికీ జరగదు కదా! మామూలుగా మన ఇష్టాలకు, కోరికలకు వ్యతిరేకంగా ఏవేవో జరుగుతూనే ఉంటాయి. అయిష్టమైనవి జరిగినప్పుడు గుడ్డిగా ప్రతిస్పందించి అశాంతిని కలుగాజేసుకోకుండా ఉండటం ఏ విధంగా సాధ్యమవుతుంది?

మనదేశంలోనూ, ఇతర దేశాలలోను ప్రాచీన కాలం నుండి మహాపురుషులు, ఋషులు మానవుని దుః:ఖానికి, అశాంతికి సంబంధించిన ఈ సమస్యను పరిశీలించి దానికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. దీని ప్రకారం అయిష్టమైనది ఏదైనా జరిగినప్పుడు, మనం కోపం, భయం లేదా మరేదో విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటాం. అప్పుడు మనసును మరో విషయంపైకి మళ్ళించాలి. ప్రతిస్పందన మొదలు కాగానే మనం వెంటనే లేచి ఒక గుక్కెడు మంచి నీళ్ళు తాగటమో, లేక కాస్త పచారు చేయటమో చేస్తే మనసును ఆ విషయాన్నుంచి మళ్ళించగలుగుతాం. దానివల్ల కోపం పెరగదు. కోపవిముక్తులవుతామంటారు. లేదా ఒకటి, రెండు........ అంటూ లెక్కపెట్టాలి. అలా కాకుంటే నమ్మకమున్న ఏదో దేవుడి పేరుగానీ, పుణ్య పురుషుని పేరుగానీ, పదాన్ని గానీ, మంత్రాన్ని గానీ జపించటం మొదలెట్టాలి. ఇలా చేస్తే ఆ వికారం నుండి మళ్ళించబడి, అటువంటి వికారాలనుంది మనం బయటపడతామంటారు వీరు.

ఈ పరిష్కారం ఒకప్పుడు ఉపయోగకరంగానే వుండేది. ఇప్పుడు కూడా ఇలాంటి విధానాలు పనిచేస్తున్నవి. వీటిని సాధన చేస్తుంటే మనకు ఆందోళన దూరమైనట్లైతే అనిపిస్తుంది. కానీ ఈ పరిష్కారాలు మనసు యొక్క చేతన స్థాయిలోనే పనిచేస్తాయి.వాస్తవంగా చూస్తే, మనసును ఇలా వికారాల నుండి మళ్లించటం వల్ల వాటిని మనసు యొక్క అచేతన స్థాయిలోకి తోక్కేయ్యటం జరుగుతోంది. అచేతన మనసులో ఆ వికారాలు అగ్నిపర్వతంలా నిద్రాణంగా ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఇవి భయంకరంగా విస్ఫోటనం చెంది తీరుతాయి..

ఈ మనసు, శరీర తత్వాన్ని తమలోనే అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, ఈ అంతర సత్యాన్ని అన్వేషించిన కొందరు, తమ అన్వేషణలో ఇంకా ముందుకు సాగి - వికారాల నుండి మనసును మళ్ళించటమంటే అసలు సమస్యనుండి దూరంగా పారిపోవటమేనని గుర్తించారు. ఇలాంటి పలాయనం సమస్యకు పరిష్కారం కాజాలదు. సమస్యను నేరుగా ఎదుర్కోవాలి. ఎప్పుడైనా మనసులో వికారం ఉత్పన్నమైనప్పుడు దాన్ని కేవలం గమనించాలి, సూటిగా గమనించాలి. ఏదైనా మనోవికారాన్ని ఇలా గమనించడం మొదలుపెట్టగానే, దాని శక్తి క్షీణించటం మొదలవుతుంది. క్రమేణా అది సమసిపోతుంది. కూకటి వేళ్ళతో పెకిలించి వేయబడుతుంది.

ఇది ఒక మంచి పరిష్కారమే. ఇక్కడ వికారాలను అణచివెయటమూ లేదు, అలాగని స్వేచ్చగా వాటిని వ్యక్తపరచటం కూడా లేదు. వికారాలను అచేతన మనసులోకి తోక్కివేయటం ద్వారా వాటిని నిర్మూలించలేము. అలాగే ఈ వికారాలను చేతలు - మాటల ద్వారా వ్యక్తపరచటం ద్వారా కొత్త సమస్యలను సృష్టించుకున్నవారమవుతాం. కానీ వాటిని కేవలం గమనించటం మాత్రమే చేస్తే, ఆ వికారాలు వాటికవే దూరమవుతాయి. మనం వాటి నుండి విముక్తులవుతాం.

వింటూంటే ఇది అద్భుతంగా ఉంది, కానీ ఇది సాధ్యమైన పనేనా? తమ తమ వికారాలను ఎదుర్కొనడం అంత సులువైన పని కాదు. కోపం వచ్చినప్పుడు, మనకు తెలియకుండానే నిమిషకాలంలోనే అది మనల్ని అధిగమించేస్తుంది. అప్పుడు కోపంలో ఊగిపోతున్న మనము మాటలతో, చేతలతో మనకు, ఇతరులకు హాని కలిగే పనులను చేస్తాము. తరువాత కోపం చల్లారిన తరువాత ఏడుస్తూ, పశ్చాత్తాప పడుతూ, వారిని లేక వీరిని లేక భగవంతుణ్ణి క్షమాపణలు కోరుతూ కూర్చుంటాము, "అయ్యో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి!" అని. కానీ మళ్ళీ కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే విధంగా స్పందిస్తూ ఉంటాము. ఇలా నిరంతర పశ్చాత్తాపము వలన ఎటువంటి ఉపయోగమూ లేదు.

చిక్కు ఎక్కడ వచ్చిందంటే ఈ వికారం కలిగినప్పుడు మనకు దాని స్పృహ ఉండదు. అది అంతర్మనస్సులోని లోలోతులలో పుడుతుంది, ఇక అది మనస్సు యొక్క పై పొరలకు చేరే సరికి ఎంత బలాన్ని పొందుతుందంటే అది మనల్నే అధిగమించేస్తుంది , దాన్ని మనం గమనించుకోలేక పోతాము.

పోనీ కోపం వచ్చినప్పుడల్లా "అయ్యా! కోపం మొదలయ్యింది!" అని చెప్పే ఒక వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకుందామంటే, ఈ కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుకని 3 పూటలకు ముగ్గుర్ని పెట్టుకోవాలి. సరే ఆ ఖర్చుని కూడా భరించగలను అనుకుందాం. ఇక కోపం రావడం మొదలయ్యింది, వెంటనే అతడు "చూడండి సార్ - కోపం వస్తుంది!" అని చెబుతాడు. అప్పుడు వెంటనే "మూర్ఖుడా! నాకే నేర్పిస్తావా నీవు, అందుకేనా నీకు జీతమిచ్చేది?" అని వాడికి గట్టిగా చివాట్లు పెడతాము. కోపంలో మునిగి ఉన్న నాకు మంచి సలహా ఇస్తే కూడా అర్థం కాదు , సహాయ పడదు.

ఒకవేళ కొంచం స్పృహలో ఉండి అలా చివాట్లు పెట్టే బదులు "చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను కూర్చుని నా కోపాన్ని గమనించుకుంటాను" అని చెప్పి వెంటనే కళ్ళు మూసుకుని చూస్తే, కోపానికి కారణమైన ఆలంబనయే (ఆ వ్యక్తియో లేక సంఘటనయో) గుర్తుకొస్తుంది. అంటే నేను కోపాన్ని గమనించట్లేదు, కోపానికి కారణమైన బాహ్య ఆలంబననే గమనిస్తున్నాను. అప్పుడు నా కోపం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. అందువలన అది సమస్యకు పరిష్కారము కాజాలదు. నిజానికి ఉత్పన్నముకు కారణమైన ఆలంబనలను వేరు చేసి నైరూప్య భావోద్వేగాలను, వికారాలను గమనించడం చాలా కష్టం.

కానీ, అంతిమ సత్యాన్ని చేరుకున్న మహాపురుషుడు ఈ సమస్యకు నిజమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. మనస్సులో వికారం చెలరేగగానే శరీర స్థాయిలో రెండు సంఘటనలు ఒకేమారు జరగడం ప్రారంభిస్తాయని ఆయన కనుగొన్నారు.మొదటిది, శ్వాస, అది తన సహజత్వాన్ని కోల్పోతుంది. మనస్సులో వికారం తలెత్తగానే శ్వాస కష్టతరమవుతుంది. ఇది స్థూలమైన, పైకి స్పష్టంగా కనపడే మామూలు విషయం. దీన్ని అందరూ సులభంగా గమనించవచ్చు. సూక్ష్మస్థాయిలో శరీరంలో ఒక రకమైన జీవరసాయన ప్రతిస్పందన, సంవేదన కలగడం రెండో సంఘటన. ప్రతి మనోవికారం శరీరంలో ఏదో ఒక భాగంలో ఏదో సంవేదనలను కలుగజేస్తూ ఉంటుంది.

ఇది ఒక ఉత్తమ పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక సామాన్య మానవుడు ఈ మనో వికారాలనూ, అమూర్త భయాన్ని, కోపాన్ని, ఆవేశాన్నీ పరిశీలించలేదు. కానీ సరియైన శిక్షనతోనూ, సాధనతోనూ మన శ్వాసను, సంవేదనలను - ఏదైతే మన మనోవికారాలకు సంబంధించినవో - వాటిని పరిశీలించటం చాలా తేలిక.

శ్వాస, సంవేదనలను మనకు రెండు విధాలుగా తోడ్పడుతాయి. మొదటిది: అవి మనకు అంతరంగిక కార్యదర్శులుగా పనిజేస్తాయి. మనస్సులో ఏదైనా వికారం ఉత్తేజితం కాగానే మన శ్వాస తన సహజ గమనాన్ని కోల్పోతుంది. "ఏదో తప్పు జరిగింది" అని హెచ్చరించటం మొదలెడుతుంది. అప్పుడు మనం మన శ్వాసను ఒక లెంపకాయ కొట్టలేము కదా! శ్వాసను ఏమీ అనలేము. ఈ హెచ్చరికను స్వీకరించాల్సిందే. అలాగే సంవేదాలను కూడా "ఏదో తప్పు జరిగింది" అని మనకు హెచ్చరిక చేస్తాయి. ఈ హెచ్చరికను గూడా మనం స్వీకరించవలసిందే. ఈ హెచ్చరికతో శ్వాసను సంవేదనలను చూడటం ప్రారంభిస్తాం. దానితో పాటు మనో వికారాలను తొలగిపోవటం కూడా చూస్తాం.

ఇలా మనసు - శరీర తత్వాకు నాణానికి రెండు వైపులలాంటివి. ఒకవైపు మనసులో ఏవో ఆలోచనలు, ఆవేశాలు ఉత్పన్నం అవుతున్నప్పుడు, రెండో వైపు శ్వాస గమనంలో మార్పు, సంవేదనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మన మనసులో ఏదైనా ఆలోచన, భావం, మనో వికారం కలిగినప్పుడు, ఆ క్షణంలోనే అవి, శ్వాస - సంవేదనలను చూడటం ద్వారా ఆ మనోవికారాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఇక్కడ సమస్య నుండి పారిపోవటం లేదు, యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎదుర్కొంటున్నాం. ఫలితంగా ఆ వికారం బలహీనమవుతుంది. గతంలో మాదిరిగా మనల్ని ఆ వికారం లోన్గాదీసుకోవటం లేదు. కొంత కాలం ఇలాగే సాగితే ఆ మనో వికారం చివరికి అదృశ్యమవుతుంది. దానితో సుఖ శాంతులు నెలకొంటాయి.

ఈ విధంగా మనసు మనం గమనించుకునే ఈ పధ్ధతి, ఉన్న నిజాన్ని దాని బాహ్య-అంతరంగిక రూపాలలో మనకు తెలియపరుస్తుంటుంది. ఇంతకూ ముందు మనం కళ్ళతో బయటి విషయాలను మాత్రమే చూస్తూ, లోపలి సత్యాన్ని గమనించే వారం కాదు. మన అశాంతికీ, దుఃఖనికీ కారణాన్ని బయటి ప్రపంచంలోనే వెతికే వాళ్ళం. మన దుః:ఖానికి బయటి కారనాలనే దూషిస్తూ, వాటినే సరిదిద్దుకోవటం చేసేవారం. మనలో జరిగే ప్రతిస్పందనను మనం తెలుసుకునే వాళ్ళం కాదు కాబట్టి, దుః:ఖ కారణం మనలోనే ఉందన్న సత్యాన్ని తెలుసుకునే వారం కాదు.

ఇప్పుడు ఈ విపశ్యన ధ్యాన శిక్షణతో నాణెం అవతలివైపు గూడా చూడగాలుగుతున్నాం. మనలోపల ఏమేమి జరుగుతుందో తెలుసుకొంటున్నాం. ఇది ఏమైనాకానీ, ఎటువంటి సంవేదన అయినా కానీ, మనసు యొక్క సంయమనాన్ని కోల్పోకుండా దాన్ని చూడటం నేర్చుకుంటున్నాం. ప్రతిక్రియ చేయటం మానివేశాం. దుః:ఖాలను పెంచుకోవటం లేదు. దానికి బదులుగా ఇప్పుడు వికారాలను బయటికి వెళ్ళగోట్టుకోవటం, వాటిని తొలగించుకోవటం చేస్తున్నాం.

ఈ సాధనను మనం ఎంత పటిష్టంగా చేస్తామో అంత వేగంగా ఈ వికారాల నుండి బయటపడటం నేర్చుకుంటాం. క్రమేణా మనసు వికారాల నుండి ప్రక్షాళన చెందుతుంది. శుద్ధమవుతుంది. శుద్ధమైన మనసు ఎల్లప్పుడూ నిరాడంబర ప్రేమతోనూ, కరుణతోనూ నిండి ఉంటుంది. అది అందరి దుః:ఖం, వైఫల్యలపట్ల కరుణతోనూ, వారి సుఖ సంతోషాలు, విజయాలపట్ల ఆనందంతోనూ, ఎల్లప్పుడూ సమతుల్యతతోనూ నిండి ఉంటుంది.

ఈ దశకు చేరుకున్నవారి జీవన విధానం పూర్తిగా పరివర్తనం చెందటం మొదలవుతుంది. అప్పుడు తమ మాటలతో గానీ, చేతలతో గానీ ఇతరుల సుఖశాంతులను ఏ విధంగా కూడా భంగపరచటం వారికి సాధ్యంకాదు. అంతేగాక, వారి సమతుల్యత వారికి శాంతిని ఇవ్వటమే కాక, ఇతరుల శాంతికి కూడా దోహదపడుతుంది. వారి చుట్టూ పక్కల వాతావరణమంతా శాంతి సామరస్యాలతో నిండి ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది.

లోపల అనుభవించేది ప్రతీది సమతతో ఎడుర్కొనవడం నేరుచుకోనవడం ద్వార, ప్రతి ఒక్కరు బాహ్య పరిస్థితులను కూడా తటస్థతతో ఎదుర్కొంటారు. అయితే ఈ తటస్థత ప్రపంచ సమస్యల నుండి పలాయించడం లేదా ఉదాసీనంగా ఉండటం కాదు. విపశ్యనను క్రమం తప్పకుండ సాధన చేసే వారు, ఇతరుల భాధలను ఇంకా బాగా అర్థం చేసుకోగలరు మరియు వారికి భాదల నుండి ఉపసమనం కలిగించడానికి తాము చేయగలిగినది ఏమాత్రం ఆందోళన లేకుండా, మనస్పూర్తిగా, ప్రేమతో, కరుణతో, సమతతో చేస్తారు. వారు పవిత్ర తటస్థతను తెలుసుకుంటారు - ఎలా పూర్తిగా కట్టుబడి ఉండాలి, ఇతరులకు సహాయం చేయడంలో పూర్తిగా పాల్గొంటారు, అదే సమయంలో మనసును కూడా సమతలో ఉంచుకుంటారు. ఈ విధంగా వారు ఇతరుల శాంతి ఆనందం కోసం పని చేస్తూ తాము ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు.

బుద్ధుడు దీనినే జీవనకళగా పేర్కొని అందరికీ బోధించాడు. ఏదో ఒక మతాన్ని గానీ, సిద్ధాంతాన్ని గానీ, ఆయన బోధించలేదు. తన అనుచరులను ఏవో కర్మకాండలను పాటించమని గానీ, వాటిని గుడ్డిగా నమ్మమని గానీ ఆదేశించలేదు. లోపలి యథార్థాన్ని యథాతథంగా చూస్తూ ప్రకృతిని పరిశీలించమని మాత్రమే ఆయన ఆదేశించాడు.అజ్ఞానం వల్ల మనకు, ఇతరులకు కూడా హాని కలిగే విధంగా ప్రతిక్రియ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ ప్రతిక్రియలు చేసే అలవాటు నుండి బయటపడటం. ఇలా గుడ్డిగా ప్రతిక్రియ చేయటం మానివేసినప్పుడు నిజమైన, నిర్మాణాత్మకమైన క్రియ చేయగలుగుతాం. అది సత్యాన్ని దర్శించి, అవగాహన చేసుకుని, సంతులిత, సమదృష్టి గల మనస్సుతో చేసే క్రియ.

ఈ తరుణంలో మనల్ని మనం తెలుసుకోవటం అవసరం. "నిన్ను నీవు తెలుసుకో" అనే ఈ సలహాను వివేకంగల ప్రతి వాడూ ఇస్తాడు. నిన్ను నీవు తెలుసుకోవటం అనేది బుద్ధి స్థాయిలో కాదు; భావాలు, సిద్ధాంతాల స్థాయిలోనూ కాదు; ఏదో విన్నదాన్ని, చదివిన దాన్ని గుడ్డిగా ఒప్పుకోవటం కాదు. దీనికి ఇలాంటి జ్ఞానం సరిపోదు అని మనం తెలుసుకోవాలి. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ప్రత్యక్షానుభవం ద్వారానే ఈ మానసిక-భౌతిక విషయాన్ని తెలుసుకోవడం ద్వారానే మన దుః:ఖాల నుండి విముక్తులము అవగలుగుతాము

మానవుడు తనను గురించిన యథార్థాన్ని ప్రత్యక్షానుభూతితో చూడటాన్ని, తనను తానూ పరిశీలించుకునే ఈ పధ్ధతినే విపశ్యన ధ్యానమంటారు. బుద్ధుని కాలపు భారతదేశ భాషలో "పశ్యన" అంటే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం. పైకి కనబడే విధంగా కాదు సుమా! ఈ మానసిక - భౌతిక క్షేత్రాల తుది సత్యాన్ని చేరుకునే వరకూ, పైకి కనబడే సత్యాన్ని ఛేదిస్తూ పోవాలి. ఈ సత్యాన్ని అనుభూతితో తెలుసుకున్నవారు గుడ్డిగా ప్రతిక్రియ చూపటం మానివేయటం ఎలాగో నేర్చుకుంటారు. దానివల్ల సహజంగానే మనోవికారాలు క్రమేపి తొలగిపోతాయి. బాధలన్నిటినుండీ బయటపడతారు.ఆనందానుభూతి పొందుతారు.

విపశ్యన ధ్యాన శిక్షణలో మూడు మెట్లు ఉన్నాయి. మొదటిది - ఇతరుల సుఖ శాంతులకు అంతరాయం కలిగించే ఏ పనినీ మాటల్తోగానీ, చేతలతో గానీ చేయకపోవటం. మనోవికారాలను పెంచే మాటలు కానీ, చేతలు కానీ కొనసాగుతున్నంతకాలం ఆ వికారాల నుండి విముక్తి పొందలేము. అందుకే ఈ సాధనలో నైతిక నియమావళి, శీలపాలన చాలా ముఖ్యం. హత్య చేయననీ, దొంగతనం చేయననీ, అక్రమలైన్గిక సంబంధాలు పెట్టుకోననీ,మత్తు పదార్థాలు సేవించననీ వాగ్దానం చేస్తారు. ఇటువంటి చర్యలకు దూరంగా ఉండటం వల్ల మనస్సు శాంతపడుతుంది. అప్పుడు ఈ సాధన నిరాటంకంగా కొనసాగించటానికి వీలవుతుంది

విశృంఖలమైన చంచలమైన మనసును కేవలం శ్వాసపై నిలపటం ద్వారా దాన్ని స్వాధీన పరచుకోవటం ఈ సాధనలో రెండవ మెట్టు. ఇందులో తమ శ్వాసపై మనసును వీలైనంతసేపు నిలపటానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రాణాయామ అభ్యాసము కాదు. శ్వాసను క్రమబద్ధం చేయటం కూడా కాదు. సహజ శ్వాసను - యథావిధిగా లోపలి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను - ఉన్నది ఉన్నట్లుగా చూడటం. దీని మూలంగా తీవ్రమైన మనోవికారాలు మనసును అనుసరించకుండా శాంతపరచడం జరుగుతుంది. అదే సమయంలో మనసులో లోతులకు ప్రవేశించి సత్యాన్ని సూటిగా చూడగలిగేటంత సామర్థ్యాన్ని పెంచుకుంటారు.

ఈ సాధనలో నైతికంగా జీవించటం, మనోనిగ్రహం కలిగి ఉండటం ఇవి రెండూ ఎంతో ఆవశ్యకమైన దశలు. కానీ మన మనసు స్వభావాన్ని గమనించి ఆ ప్రజ్ఞతో దాన్ని ప్రక్షాళన చేసుకునే దశకు ఎదగకపోతే, ఈ మొదటి రెండు దశలో వికారాల అణచివేతకు దారితీస్తాయి. ఈ మూడవ దశనే నిజమైన విపశ్యన అంటారు. మనలో ఎల్లప్పుడూ మారుతూ ఉండే సంవేదనలను సమతుల్యమైన మనస్సుతో గమనిస్తూ, మనలో నుండే ఈ యథార్థాన్ని ప్రత్యక్షానుభూతితో తెలుసుకోవటమే నిజమైన విపశ్యన. ఇదే బుద్ధుని బోధనల సారాంశం. స్వయంగా పరిశీలించి మనసును శుద్ధి చేసుకునే ప్రక్రియ.

ప్రతి ఒక్కరూ ఈ సాధన చేయ వచ్చు. మనసు బాధించే వ్యాధి ఏదో ఒక వర్గానికి పరిమితమైంది కాదు. కాబట్టి దాని చికిత్సా విధానం కూడా సార్వజనీనంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బాధకు లోనయ్యేవారే కదా! కోపంతో బాధపడుతున్నప్పుడు అది హిందూ కోపమని గానీ , క్రైస్తవ కోపమని గానీ, బౌద్ధ కోపమని గానీ ఉండవు గదా! కోపము కోపమే. దాని వల్ల దుః:ఖానికి లోనవుతుంటాం. అది హిందూ దుః:ఖము కాదు. క్రైస్తవ ద:ఖము కాదు, బౌద్ధ దుః:ఖము కాదు. అందుకే ఈ సార్వజనీన వ్యాధికి సార్వజనీన చికిత్సే కావాలి.

అటువంటి చికిత్స, ఔషధమే విపశ్యన. ఇతరుల సుఖశాంతులను గౌరవించె ఈ జీవన నియమావళి పట్ల ఎవరికీ అభ్యంతరము ఉండదు. తమ మనసును స్వాధీనపరచుకోవటమంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. మనో వికారాల నుండి విముక్తి కోసం తమలోని యథార్థాన్ని చూడగలిగే శక్తిని పెంచుకోవటమన్నాకూడా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇది సార్వజనీన మార్గం.

యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం, లోపల సత్యాన్ని దర్శించటం అంటే మనను మనం వాస్తవిక స్థాయిలో, అనుభూతి స్థాయిలో తెలుసుకోవటం. సాధన చేస్తూ పోతే వికారాలు కలిగించే దుః:ఖము నుండి విముక్తి పొందుతాం. స్థూలమైన, బాహ్యమైన పైపై సత్యంతో మొదలుపెట్టి మనసు లోలోని అంతిమ సత్యంలోనికి ప్రవేశిస్తాం. ఈ స్థాయిని దాటిపోయి, ఎప్పుడైతే మనసు - పదార్థాలకు అతీతమైన, కార్యకారనాలకు అతీతమైన, దేశకాలాలకు అతీతమైన, సత్యాన్ని అనుభూతితో తెలుసుకుంటామో అప్పుడు మనోవికారాల నుండి, కల్మషాల నుండీ, దుః:ఖాల నుండీ సంపూర్ణ విముక్తిని ప్రసాదించే సత్యాన్ని గ్రహిస్తాం. ఈ పరమసత్యాన్ని ఏ పేరుతొ పిలుస్తామన్నది ముఖ్యం కాదు. ఇదే విశ్వజనీన మార్గం. ఇదే ప్రతి ఒక్కరు చేరుకోవలసిన అంతిమ గమ్యం.

మీరందరూ ఈ పరమ సత్యానుభూతిని పొందుదురు గాక! మనో వికారాల నుండీ, కల్మషాల నుండీ బాధపడుతున్న సర్వప్రాణులూ తమ తమ దుః:ఖాల నుండి విముక్తి పొందుదురు గాక! సకల ప్రాణులూ నిజమైన ఆనందాన్ని, నిజమైన శాంతినీ, నిజమైన సామరస్యాన్నీ అనుభవించుగాక!

భవతు సర్వ మంగళం