ప్రపంచ శాంతి సమావేశంలో శ్రీ గోయెంక గారి ప్రసంగం
శ్రీ బిల్ హిగ్గిన్స్ ద్వారతేదీ: ఆగస్టు 29, 2000
న్యూయార్క్- సహస్రాబ్ది ప్రపంచ శాంతి సదస్సు కోసం తరలివచ్చిన ప్రతినిధులనుద్దేశించి, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్ లో విపశ్యన ఆచార్యులు శ్రీ గోయెంక గారు ఇచ్చిన ప్రసంగం. ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి మత, ఆధ్యాత్మిక నేతల ప్రప్రథమ సమావేశం ఇదే.
"వివాదాల పరివర్తనం" అనే సమావేశంలో, శ్రీ గోయెంక గారి ప్రసంగం, మత సామరస్యం, సహనం మరియు శాంతియుత సహా జీవనం వంటి విషయాలను నొక్కి వక్కాణించింది.
"ప్రజలను ఒక వ్యవస్థీకృత మతం నుండి, ఇంకొక వ్యవస్థీకృత మతానికి మార్చడం కాకుండా, మనం ప్రజలను కష్టాల నుండి సంతోషాల వైపు, బానిసత్వం నుండి విముక్తికి మరియు క్రూరత్వం నుండి కారుణ్యానికి మార్చేటందుకు ప్రయత్నం చేయాలి" అని శ్రీ గోయెంక గారు అన్నారు.
శ్రీ గోయెంక గారు తన ప్రసంగాన్ని ఈ సదస్సు మధ్యాహ్న సమావేశంలో గల సుమారు రెండు వేల మంది ప్రతినిధులు, పరిశీలకులను ఉద్దేశించి చేశారు. సి యన్ యన్ వ్యవస్థాపకులు శ్రీ టెడ్ టర్నర్ గారి ప్రసంగం తరువాతి సమావేశంలో గోయెంక గారు మాట్లాడారు. టర్నర్ గారు సదస్సు ఆర్ధిక పోషకుల్లో ఒకరు.
సదస్సు లక్ష్యమైన ప్రపంచ శాంతి స్థాపనను దృష్టిలో ఉంచుకొని, శ్రీ గోయెంక గారు తన ప్రసంగంలో "వ్యక్తులలో శాంతి లేక పోతే ప్రపంచ శాంతి సాధించ లేమ"ని నొక్కి వక్కాణించారు. "ప్రజల హృదయాలలో కోపం, ద్వేషం ఉంటే, ప్రపంచంలో శాంతి ఉండదు. హృదయంలో ప్రేమ మరియు కరుణతో మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యం." అని ఆయన అన్నారు.
మత సంఘర్షణ, ఉద్రిక్తత లను తగ్గించటం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని గురించి శ్రీ గోయెంక గారు ఈ విధంగా అన్నారు - "ఒకరి లోపల కోపము, ద్వేషము ఉంటె, వారు క్రిస్టియన్ అయినా, హిందువు అయినా, ముస్లిం అయినా దుఃఖం అనుభావిన్చావలసినదే"
"అదే విధంగా ఎవరు స్వచ్చమైన హృదయంతో ప్రేమ, కరుణ కలిగిఉంటారో, వారు మనస్సులో స్వర్గానుభుతిని పొందుతారు. ఇదే ప్రకృతి నియమం లేదా దేవుని సంకల్పం" అని కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు.
"మనం అన్ని మతాలలో ఉన్న సారూప్యాలు, మతాల మూల సారాంశం అయిన హృదయ స్వచ్ఛత మీద దృష్టి కేంద్రీకరిద్దాము. మనం మతం యొక్క ఈ అంశానికి ప్రాముఖ్యతనిచ్చి మతం యొక్క బాహ్య రూపాలైన వివిధ ఆచారాలు, పండుగలు, గుడ్డి నమ్మకాలను విస్మరించాలి." అని ప్రపంచ ప్రధాన మత గురువులకు సంఘానికి చెప్పారు.
గోయెంక గారు తన ప్రసంగాన్ని ముగిస్తూ, అశోక చక్రవర్తి తన ఒకానొక శిలా ఫలకంలో లిఖించిన దానిని ఉటంకించారు - " ఎవరు కూడా తమ స్వంత మతంను మాత్రమే గౌరవించి, ఇతర మతాలను విమర్శించకూడదు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను వివిధ కారణాల వల్ల గౌరవించాలి. అలా చేయడం ద్వారా, ప్రతి ఒక్కరు తమ స్వంత మతాల అభివృద్ధికి సహాయ పడటమే కాక, ఇతర మతాలకు కూడా సేవ అందించిన వారవుతారు. దీనికి వ్యతిరేఖంగా వ్యవహరిస్తే, తమ స్వంత మతాలకు సమాధి తవ్విన వారు కావడమే కాకుండా ఇతర మతాలకు హాని చేసిన వారవుతారు. తమ మతాన్ని మాత్రమే గౌరవిస్తు, ఇతర మతాల్ని విమర్శించే వాళ్ళు, తమ మతం పట్ల ఉన్న ఆరాధనా భావం వల్ల, "నేను నా మతాన్ని ప్రకాశింప చేస్తున్నాను" అని అనుకుంటూ ఉండవచ్చు. కాని, వారి పనులు తమ స్వంత మతాన్ని ఇంకా తీవ్రంగా నష్ట పరుస్తాయి. ఐక్యమత్యం మంచిది. మనం అందరం ఇతరులు భోదించిన సిద్దాంతాలను వినడానికి సిద్ధంగా ఉందాము, విందాము."
ఐక్యరాజ్య సమతి ప్రధాన కార్యదర్శి శ్రీ కోఫీ అన్నన్ గారు ఈ సదస్సును "ఇది మనం కొత్త సహస్రాబ్దిలో అడుగిడుతున్న సమయంలో, ప్రపంచంలోని ఉన్నత మత, ఆధ్యాత్మిక నేతలు, శాంతి కోసం సమైక్య పిలుపు ఇవ్వడానికి సమావేశం అయిన సదస్సు. వీరి ఈ పిలుపు ప్రపంచ శాంతి అవకాశాలను మరింత బల పరుస్తాయని ఆశిద్దాం" అని అన్నారు.
ఐక్య రాజ్య సమతిలో ప్రప్రథమముగా జరిగిన ఈ రకమైన సమావేశానికి ఆహ్వానించబడిన వారిలో స్వామి నారాయణ ఉద్యమ ప్రముఖ స్వామి, స్వామి దయానంద సరస్వతి, స్వామి అగ్నివేష్, మాతా అమృతానందమయి మరియు దాదా వాస్వాని లాంటి ఆధ్యాత్మిక నేతలే కాకుండా, డా|| కరణ్ సింగ్ మరియు యల్. యం. సింఘ్వి వంటి ప్రముఖ పండితులు కూడా ఉన్నారు.
సమావేశంలో పాల్గొన్న వారి మత, సాంస్కృతిక వైవిధ్యం గురించి మాట్లాడుతూ శ్రీ అన్నన్ గారు "ఐక్యరాజ్య సమితి అనే ఈ చిత్రయవనిక లో సూటులు, చీరలే కాక క్లెరిక్ల కాలర్లు, సన్యాసినుల వస్త్రాలు, లామల చీవారములు, బిషప్పుల తల పాగాలు, యూదులు ధరించే చిన్న టోపీలు వంటి వస్త్రాలు కూడా ఉన్నాయి" అని అన్నారు.
టిబెట్ నాయకులు లేకపోవడం గురించి శ్రీ అన్నన్ గారిని పదేపదే ప్రశ్నించినప్పటికీ, ఆయన ఆ ప్రశ్నలను సదస్సు లక్ష్యం వైపు తిప్పడానికి ప్రయతిన్చారు. "మతపు నిజమైన పాత్ర శాంతి సంధాతగా ఉండటం, శాంతింపచేయటం. ఆ నిజమైన పాత్రను పునరుద్దరించటానికి సమస్య బైబిల్, తోరా లేదా ఖురాన్ కాదు. నిజానికి విశ్వాసం ఎప్పటికి సమస్య కాదు - సమస్యంతా విశ్వసిస్తున్న వాళ్ళతో మరియు మనం ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తాము అన్న దాని గురించే. మీరు మరొక్క సారి మీ విశ్వాసులకు శాంతి, సహన మార్గాలు నేర్పించాలి" అని అన్నారు.
ప్రపంచ జనాభాలో 83% మంది ఏదో ఒక మత లేదా తత్వ విశ్వాసానికి కట్టుబడి ఉన్నారు. కావున అలాంటి వారిని ఈ మత నాయకులు శాంతి వైపు నడిపించడానికి ప్రభావం చూపగలరనేది ఐక్యరాజ్య సమితి నాయకుని ఆకాంక్ష.
ఒకానొక పత్రంలో ఐక్యరాజ్య సమితి ఈ విధంగా పేర్కొన్నది - "మానవ క్రురత్వపు అతి భయంకర రూపమైన యుద్ధాన్ని, ఆ యుద్ధానికి ఒకానొక మూల కారణమైన పేదరికాన్ని నిర్మూలించగల శక్తి ఆధ్యాత్మికతకు ఉన్నదనే విషయాన్నీ ప్రపంచ సమాజం గుర్తించేలా ఈ సదస్సు తోడ్పడగలదని ఐక్యరాజ్య సమితి ఆశ. మానవాళి తక్షణావసరాలను పరిష్కరించే ప్రయత్నంలో ప్రపంచ ఆధ్యాత్మిక నేతలు ఐక్యరాజ్య సమితితో మరింత సన్నిహితంగా పనిచేసే సమయం ఆసన్నమయింది."
ఈ సదస్సు ఈ గురువారం, ఆగష్టు 31 న ముగుస్తుంది. ఆ రోజు ఈ సదస్సులో పాల్గొనే వారంతా ప్రపంచ శాంతి ప్రకటన మీద సంతకం చేసి, మత, ఆధ్యాత్మిక నాయకుల అంతర్జాతీయ సలహా మండలి గా ఎర్పడుతారు. ఈ సలహా మండలి శాంతి స్థాపనకు, శాంతి పరిరక్షణకు, ఐక్య రాజ్య సమితితోనూ, సమితి ప్రధాన కార్యదర్శితోనూ కలిసి పని చేస్తుంది.
"మత మరియు ఆధ్యాత్మిక నేతల అంతర్జాతీయ సలహా మండలి లక్ష్యం ఏమిటంటే, ఐక్య రాజ్య సమితి పనిని మెరుగు పరచి, బలోపేతం చేయడం" అని ప్రపంచ శాంతి సదస్సు కార్యదర్శి శ్రీ బవ జైన్ గారు అన్నారు. "యుద్ధ కాలంలో ప్రపంచంలోని గొప్ప మత మరియు ఆధ్యాత్మిక గురువులను ఆ ప్రదేశాలకు పంపి, సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించవచ్చునని మేము హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము" అని కూడా ఆయన అన్నారు.